![]() |
![]() |
(ఫిబ్రవరి 20 విజయనిర్మల జయంతి సందర్భంగా..)
- నటిగా 100 సినిమాలు పూర్యయ్యాకే డైరెక్షన్ చెయ్యమని కష్ణ చెప్పారు.. ఎందుకో తెలుసా?
- ముగ్గురు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన విజయనిర్మల
- హీరోయిన్గా విజయనిర్మల క్రియేట్ చేసిన రికార్డ్ ఏమిటో తెలుసా?
చిత్ర పరిశ్రమలో నటీనటులుగా రాణించడం అంత సులువు కాదని పాతతరం వారిని చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నటీమణులు ఈ విషయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయితే కొందరి అదృష్టం వల్ల వారి కెరీర్ ఉజ్వలంగా సాగుతుంది. అలాంటి వారిలో నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల ఒకరు. చిన్నతనంలోనే నటనకు శ్రీకారం చుట్టిన ఆమె.. ప్రపంచంలో ఏ మహిళా సాధించని ఘనత సాధించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. 65 ఏళ్ళ విజయనిర్మల కెరీర్లో చేసిన సినిమాలు, నటిగా.. దర్శకురాలిగా సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం.
విజయనిర్మల(Vijayanirmala) అసలు పేరు నీరజ. 1950లో తమిళ చిత్రం ‘మచ్చరేఖ’ ద్వారా బాలనటిగా రంగ ప్రవేశం చేశారు. 1957లో నటరత్న ఎన్.టి.రామారావు(N.T.Rama Rao) నిర్మించిన ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రంలో బాలకష్ణుడుగా నటించారు. ఈ చిత్రంలోని ‘జయ కష్ణా ముకుందా మురారి’ పాటలో ఆమె అభినయం అందర్నీ ఆకట్టుకుంది. 1966లో వచ్చిన ‘రంగుల రాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ సినిమాతో తన పేరును నిర్మలగా మార్చుకున్నారు. అప్పటికే నిర్మల పేరుతో మరో నటి ఉన్నారు. విజయ అనుబంధ సంస్థ ద్వారా నటిగా పరిచయం కావడంతో అప్పటి నుంచి తన పేరుకు ముందు విజయ చేర్చి విజయనిర్మలగా మారారు.
ఆ మరుసటి సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ చిత్రంతో విజయనిర్మల జీవితం కొత్త మలుపు తిరిగింది. ఈ సినిమాలో హీరోగా నటించిన కృష్ణతో సాన్నిహిత్యం పెరగడంతో 1969లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్లో లెక్కకు మించిన సినిమాలు వచ్చాయి. రికార్డు స్థాయిలో కష్ణతో కలిసి 50 సినిమాల్లో నటించారు విజయనిర్మల. అంతకుముందు రెండు సినిమాల్లో కష్ణ(Krishna), విజయనిర్మల అన్నాచెల్లెళ్లుగా నటించడం విశేషం.
పెళ్లి తర్వాత కూడా వరసగా సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయనిర్మల. ఆ సమయంలోనే ఆమె దృష్టి దర్శకత్వం వైపు మళ్లింది. అయితే నటిగా 100 సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్షన్ వైపు వెళ్ళమని భర్త కృష్ణ సలహా ఇచ్చారు. నటిగా పరిచయమైన ఏడేళ్ళలోనే 100 సినిమాలు పూర్తి చేసి 1973లో ‘కవిత’ చిత్రంతో మలయాళంలో, ‘మీనా’ చిత్రంతో తెలుగులో దర్శకురాలిగా పరిచయమయ్యారు. ‘మీనా’ చిత్రం ఘనవిజయం సాధించి ఆమెకు డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చింది.
అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao), శివాజీ గణేశన్, రజినీకాంత్(Rajinikanth) వంటి స్టార్స్‌ని కూడా డైరెక్ట్ చేసిన ఘనత విజయనిర్మల సొంతం. తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. 42 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా 2002లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు. ఆ తర్వాత మరో రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు. తన సొంత బేనర్లో 16 సినిమాలు నిర్మించారు విజయనిర్మల. తన డైరెక్షన్లోనే ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రం ద్వారా తనయుడు నరేష్‌ను హీరోగా పరిచయం చేశారు.
![]() |
![]() |